'human shield: మానవహక్కుల సంఘం వర్సెస్ జమ్ముకశ్మీర్ ప్రభుత్వం!
- అప్పట్లో సంచలనం సృష్టించిన ‘మానవ కవచం ఘటన’
- ఆర్మీ అధికారి గొగోయ్‌పై ఎస్హెచ్ఆర్సీలో కేసు నమోదు
- బాధితుడికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశం
- ఇవ్వలేమన్న జమ్ముకశ్మీర్ ప్రభుత్వం
రాళ్లదాడి నుంచి తప్పించుకునేందుకు ఆర్మీ అధికారి ఒకరు మానవకవచంగా ఉపయోగించిన వ్యక్తికి పరిహారం ఇచ్చేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ ఏడాది మొదట్లో తనపై రాళ్ల దాడికి యత్నించిన ఉగ్రమూక నుంచి తప్పించుకునేందుకు ఆర్మీ అధికారి ఒకరు తన జీపు ముందు భాగానికి ఫరూఖ్ అహ్మద్ దార్ అనే వ్యక్తిని కట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారు.
అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్హెచ్ఆర్సీ) ఫరూఖ్ అహ్మద్‌కు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. ఎస్హెచ్ఆర్సీ ఆదేశాలకు స్పందించిన రాష్ట్రప్రభుత్వం వివిధ కారణాల రీత్యా అహ్మద్ దార్‌కు పరిహారం ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇటువంటి ఘటనకు పరిహారం ఇచ్చే అవకాశం లేదని, ఈ విషయంలో తమను ఆదేశించే అధికారం ఎస్హెచ్ఆర్సీకి లేదని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 9న శ్రీనగర్-బుద్గాం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా పలు ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంది. ఆందోళనకారులు రాళ్ల దాడితో ఆర్మీపై విరుచుకుపడ్డారు. ‘స్టోన్ పెల్టింగ్’ నుంచి తప్పించుకునేందుకు ఆర్మీ మానవకవచాన్ని ఆయుధంగా వాడుకుంది. ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ అయిన ఫరూఖ్ అహ్మద్ దార్ (27)ను మేజర్ గొగోయ్ తన జీపుకు కట్టి వివిధ గ్రామాల్లో పరేడ్ నిర్వహించారు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు గొగోయ్‌కు అండగా నిలిచారు. అంతేకాదు, ఆర్మీ చీఫ్ అతడికి ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు కూడా.
అయితే మానవకవచాన్ని వాడుకున్న మేజర్ గొగోయ్‌పై మానవహక్కుల సంఘంలో కేసు నమోదైంది. దర్యాప్తు జరిపిన ఎస్హెచ్ఆర్సీ బాధితుడు అహ్మద్ దార్‌కు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఎస్హెచ్ఆర్సీ ఆదేశాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కొట్టిపడేసింది. ఈ ఘటన ఎస్హెచ్ఆర్సీ పరిధిలోకి రాదని, బాధితుడికి పరిహారం ఇవ్వలేమని తేల్చి చెప్పింది.