కేసీఆర్: భట్టి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్న కేసీఆర్!
- రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోందన్న భట్టి
- ఆ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేసీఆర్
- రికార్డుల నుంచి తొలగించాలని సూచించిన ముఖ్యమంత్రి
రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ రికార్డ్స్ ప్రక్షాళనకు పదిరోజులు కేటాయించామని, ఆ పది రోజుల తర్వాత రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా పెండింగ్ ఉండదని సభా ముఖంగా కేసీఆర్ హామీ ఇస్తారా? ఇవ్వగలరా? ఆ విధంగా ఆయన హామీ ఇస్తారని తాను అనుకోవట్లేదని అని భట్టి అన్నారు.
దీనికి స్పందించిన కేసీఆర్, తాను ఏమి హామీ ఇస్తా, ఏది ఇవ్వను అనే విషయం కూడా ఆయనే చెబితే ఎలా? ఇదెక్కడి విధానం? అని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితుల పని వేరని, భూ రికార్డుల ప్రక్షాళన వేరని, ఈ పనిలో సమన్వయ సమితులను జోక్యం చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.భట్టి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రికార్డుల్లో నుంచి వాటిని తొలగించాలని కేసీఆర్ కోరారు.
రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ భూ రికార్డులను ఎందుకు ప్రక్షాళన చేయలేదో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పదిహేనేళ్ల క్రితం విక్రయించిన భూమికి కూడా గత ప్రభుత్వం పట్టా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. భూ సమగ్ర సర్వేలో భాగంగా ఆ భూమికి తమ ప్రభుత్వం పట్టా ఇచ్చిందని అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయడం సబబు కాదని, ఏ విషయంలోనైనా ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు చేస్తే బాగుంటుందని కేసీఆర్ సూచించారు.