Virat Kohli: అప్పట్లో కోహ్లీని ఎంపిక చేసినందుకు పదవిని కోల్పోయిన దిలీప్ వెంగ్‌సర్కార్.. తాజాగా వెలుగు చూసిన ఆసక్తికర విషయం!
- అంతర్జాతీయ క్రికెట్‌కి విరాట్‌ను ఎంపిక చేసిన దిలీప్ వెంగ్‌సర్కార్
- మరునాడే అతన్ని కమిటీ నుంచి తీసేసిన బీసీసీఐ
- 'డెమోక్రసీస్ ఎలెవన్' పుస్తకంలో వెల్లడించిన రాజ్‌దీప్ సర్దేశాయ్
ఇవాళ బ్రాండ్ విలువలో ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీని దాటేసిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడనే విషయం చాలా మందికి తెలుసు. అతని విజయానికి సంబంధించిన ఒక విషయం ఇటీవల బయటికొచ్చింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తన 'డెమోక్రసీస్ ఎలెవన్' పుస్తకంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. విరాట్‌ను అంతర్జాతీయ క్రికెట్ జట్టులోకి ఎంపిక చేసినందువల్ల అప్పటి బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ తన పదవిని కోల్పోయినట్లు సర్దేశాయ్ పేర్కొన్నారు.
ఎస్. బద్రినాథ్‌ను కాదని ప్రపంచ టూర్ కోసం విరాట్ కోహ్లీని వెంగ్ సర్కార్ ఎంపిక చేశాడు. ఈ విషయంపై అప్పట్లో తమిళనాడు క్రికెట్‌కి కోశాధికారిగా ఉన్న ఎన్. శ్రీనివాసన్, బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్‌కి ఫిర్యాదు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీ నుంచి తనను తీసేశారు కానీ, విరాట్ కోహ్లీని మాత్రం జట్టులోనే ఉంచుతూ తన నిర్ణయానికి గౌరవం ఇచ్చారని దిలీప్ అన్నాడు. కెరీర్ ప్రారంభంలో విరాట్ కొద్దిగా ఫిట్‌నెస్‌లో లేకపోవడం, కొంత స్టైలిష్ ఇమేజ్ సంపాదించుకోవడం వల్ల దిలీప్ మినహా మిగతా సెలక్షన్ కమిటీ సభ్యులు అతన్ని ఎంపిక చేయడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.