Paradise Papers leak: పారడైజ్ పేపర్స్ లీక్‌లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పేరు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైనం!
- ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ప్యారడైజ్ పేపర్స్ లీకేజీ
- 10 మిలియన్ పౌండ్లు విదేశాలకు తరలించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్
- నైక్, ఫేస్బుక్ కూడా అప్లెబీ క్లయింట్లే
ప్రస్తుతం తెరపైకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘పారడైజ్ పేపర్స్’ లీక్‌లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పేరు కూడా ఉండడం చర్చనీయాంశమైంది. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాల్లో సొమ్ము దాచుకున్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన ‘నైక్’, ‘ఫేస్బుక్’ వంటి సంస్థలతోపాటు బ్రిటన్ రాణి కూడా ఉండడం కలకలం సృష్టిస్తోంది.
క్వీన్ ఎలిజబెత్ సహా ప్రపంచ ప్రముఖులు కూడా ప్యారడైజ్ పేపర్స్ లీక్‌లో ఉన్నారు. మొత్తం 13.4 మిలియన్ పేపర్లు లీకవగా అందులోని అందరూ తమ ఆస్తులను విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్నవారేనని పేపర్లు వెల్లడించాయి. పనామా పేపర్స్ లీకేజీ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద డేటా లీకేజీలో ప్యారడైజ్ పేపర్స్ లీకేజీ రెండోదని చెబుతున్నారు.
కాగా, క్వీన్ ఎలిజబెత్ ప్రైవేట్ ఎస్టేట్ రహస్యంగా 10 మిలియన్ పౌండ్ల (రూ. 84 కోట్లు)ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు ప్యారడైజ్ పేపర్స్ ద్వారా తెలుస్తోంది. పన్నుల నుంచి తప్పించుకునేందుకు వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది.