జగన్: జగన్ సంకల్పయాత్ర సాహసోపేత నిర్ణయం: వైసీపీ నేతలు
- పాదయాత్రలో అన్ని వర్గాల వారిని జగన్ కలుపుకుపోతారు
- మాటకు కట్టుబడి ఉండటం జగన్ నైజం
- చెప్పింది చేయకపోవడం చంద్రబాబుకు అలవాటు
- మీడియాతో మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తలపెట్టనున్న ప్రజా సంకల్పయాత్ర ఆయన తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయమని వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రలో అన్ని వర్గాల వారిని జగన్ కలుస్తారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని, రాజధాని నిర్మాణం గ్రాఫిక్స్ కే పరిమితమైందని విమర్శించారు.
చెప్పింది చేయకపోవడం చంద్రబాబుకు అలవాటని, చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం జగన్ నైజమని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పే అలవాటు జగన్ కు లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికే తమ నాయకుడు ప్రజా సంకల్ప యాత్రను చేపట్టబోతున్నారని అన్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ రాయచోటిలోని పెద్ద దర్గాలో ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన ప్రార్థనలు చేశారు.