జగన్: జగన్ పాదయాత్రలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత: అంబటి రాంబాబు
- లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- చంద్రబాబు కుట్రలను వైసీపీ కార్యకర్తలు ఎదుర్కోవాలి
- మా పాదయాత్ర శాంతియుతంగా నిర్వహిస్తాం
- జగన్ ని ప్రజలు ఆశీర్వదించాలి: అంబటి
జగన్ పాదయాత్రలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యతని, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, బాబు కుట్రలను వైసీపీ కార్యకర్తలు ఎదుర్కోవాలని, ప్రజలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
నాటి తుని విధ్వంసానికి కుట్ర రచన చేసింది టీడీపీనేనని, అందుకే, ఆ నివేదిక బయటపెట్టడం లేదని ఆరోపించారు. నాడు టీడీపీ చేసినట్టే ఇతరులు కూడా చేస్తారేమోనని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. తమ పాదయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని, జగన్ ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.
ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్ ను విమర్శించడం చంద్రబాబు మానేశారని, నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరితే రంకెలేసిన బాబు, రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యవహారంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రేవంత్ ను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపించారేమో అనే అనుమానం వస్తోందని, బాబు విధానాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు గమనించాలని అంబటి రాంబాబు అన్నారు.