రేవూరి ప్రకాష్ రెడ్డి: నా తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతా: రేవూరి ప్రకాష్ రెడ్డి
- పార్టీ మారిన సీతక్కపై విమర్శలు గుప్పించిన రేవూరి
- ఆమెను చంద్రబాబు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు
- వ్యక్తిత్వం దెబ్బతింటే ఇంట్లో కూర్చుంటాను తప్పా, పార్టీ మారను
- పాత్రికేయులతో మాట్లాడిన రేవూరి
తన తుదిశ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని టీటీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన సీతక్క, రాజకీయ పునరేకీకరణ అని అనడం సిగ్గుచేటని విమర్శించారు. నక్సలైట్ గా జీవితం ప్రారంభించి టీడీపీలో చేరిన సీతక్కను చంద్రబాబు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, రాజకీయ పునరేకీకరణ అంటే నాయకులు పార్టీలు మారడం కాదని అన్నారు.
తన వ్యక్తిత్వం దెబ్బతిన్న రోజున ఇంట్లో కూర్చుంటాను తప్పా, పార్టీ మాత్రం మారనంటూ భావోద్వేగం చెందారు. టీడీపీ నుంచి బయటకు రమ్మనమంటూ తనపై ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు ఒత్తిడి తెచ్చాయని, తన తుదిశ్వాస వరకు ‘తెలుగుదేశం’ వీడనని స్పష్టం చేశారు.