bogan: తమిళ చిత్రం 'బోగన్' రీమేక్ నుంచి రవితేజ నిష్క్రమణ... సందిగ్ధంలో దర్శకుడు లక్ష్మణ్
- స్క్రిప్ట్‌ను రవితేజ ఇమేజ్‌కు అనుగుణంగా మార్చిన దర్శకుడు
- ఇటీవల సినిమాకు నో చెప్పిన రవితేజ
- ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్న లక్ష్మణ్
'రాజా ది గ్రేట్' చిత్రం అనూహ్య విజయం సాధించడంతో రీమేక్‌ల జోలికి పోవద్దని రవితేజ నిర్ణయించుకున్నాడు కాబోలు అందుకే 'రాజా ది గ్రేట్' విడుదలకు ముందే ఒప్పుకున్న తమిళ చిత్రం 'బోగన్' రీమేక్‌లో నటించబోనని కరాఖండిగా చెప్పేశాడు. రవితేజ అలా చెప్పడం వల్ల ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన లక్ష్మణ్ కంగు తిన్నాడట.
జయం రవి, అరవింద్ స్వామిలు నటించిన 'బోగన్' చిత్రానికి తమిళంలో కూడా లక్ష్మణే దర్శకత్వం వహించారు. ఈ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకోవడంతో ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఎనిమిది నెలలు కష్టపడి స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్లు లక్ష్మణ్ చెప్పాడు. ఇప్పుడు రవితేజ నిష్క్రమించడం వల్ల ఈ స్క్రిప్ట్‌ను మరో హీరోకి చెప్పాలా? లేక దీన్ని వదిలేసి ఇంకేదైనా చిత్రం కోసం ఏర్పాట్లు చేసుకోవాలా? అనే సందిగ్ధంలో పడినట్లు వివరించాడు.
'సినిమా స్క్రిప్ట్‌ను రవితేజ ఎనర్జీకి, తెలుగు ప్రజల అభిరుచికి తగ్గట్లుగా మార్చాను. ఈ సినిమా చేయలేనని రవితేజ చెప్పగానే చాలా బాధ కలిగింది. నా తదుపరి కార్యాచరణ గురించి స్పష్టత రావడానికి నాకు కొంత సమయం కావాలి' అని లక్ష్మణ్ అన్నాడు. ఈ చిత్రంలో రవితేజతో పాటు కేథరీన్ త్రెసాను కథానాయికగా అనుకున్నారు. తమిళ నటుడు ఎస్‌జే సూర్యను కీలక పాత్ర కోసం కూడా తీసుకున్నారు.