whatsapp: డిసెంబర్లో అందుబాటులోకి రానున్న వాట్సాప్ చెల్లింపులు?
- యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టనున్న వాట్సాప్
- ఇప్పటికే ప్రారంభమైన టెస్టింగ్
- వెల్లడించిన 'ఫ్యాక్టర్ డైలీ' మేగజైన్
ఫేస్బుక్ వారి మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్ త్వరలో భారతదేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సేవలు డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రముఖ సాంకేతిక మేగజైన్ 'ఫ్యాక్టర్ డైలీ' వెల్లడించింది. ఇప్పటికే ఈ ఫీచర్‌కి సంబంధించిన టెస్టింగ్ టూల్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టిందని పేర్కొంది. నవంబర్‌లో బీటా వెర్షన్, డిసెంబర్లో పూర్తిస్థాయి వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముందని తెలిపింది.
ఈ ఫీచర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలతో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డిజిటలైజేషన్లో భాగంగా దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత సేవల వినియోగం పుంజుకుంటోంది. వీటి ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారా డబ్బులు పంపించుకునే వీలు కలుగుతుంది. దేశంలో 250 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఈ సేవలు అందుబాటులోకి వస్తే వాట్సాప్ ద్వారా సులభంగా డబ్బు పంపించుకునే అవకాశం కలగనుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన 'లైవ్ లొకేషన్' ఫీచర్ పక్కనే 'రూపీ' గుర్తుతో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. రూపీ గుర్తును క్లిక్ చేసి వాట్సాప్ కాంటాక్టులకు డబ్బు పంపడం గానీ, తీసుకోవడం గానీ చేయవచ్చు.