foundation day: స్థాపనా దినోత్సవం జరుపుకుంటున్న ఐదు రాష్ట్రాలు... శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- నవంబర్ 1న ఏర్పడిన హర్యానా, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలు
- హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ట్వీట్ చేసిన మోదీ
- వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న ఆయా రాష్ట్రాలు
ఇవాళ స్థాపనా దినోత్సవాలు (ఫౌండేషన్ డే) జరుపుకుంటున్న హర్యానా, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాల్లో అభివృద్ధి, సాధికారత సాధించి దేశాభివృద్ధిలో భాగం కావాలని ఆయన కోరారు. హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు హిందీలో, కేరళకు మలయాళంలో, కర్ణాటకకు కన్నడ భాషలో మోదీ ట్వీట్ చేశారు. స్థాపనా దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
60వ కేరళ పిరవి (కేరళ డే) సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ పి. సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్లు శుభాకాంక్షలు తెలిపారు. హర్యానాలో 51వ స్థాపనా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హిస్సార్‌లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆ రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా, కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నారు. 62వ స్థాపనా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్ మధ్యప్రదేశ్ వికాస్ యాత్రను ప్రారంభించనున్నారు. 62వ స్థాపనా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో రాజ్యోత్సవ్ పేరిట 62 మంది ప్రముఖులకు అవార్డులు ఇవ్వనున్నారు.