civils mains: సివిల్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్.... పట్టుబడిన ఐపీఎస్ అధికారి
- ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో కాపీ కొట్టిన ఐపీఎస్
- సహాయం చేసిన భార్య, లా ఎక్సలెన్స్ స్టడీ సర్కిల్ డైరెక్టర్
- అరెస్టు చేసిన చెన్నై పోలీసులు
ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం సంవత్సరాల తరబడి కష్టపడి చదివే అభ్యర్థులను చూస్తుంటాం. తమిళనాడుకి చెందిన సఫీర్ కరీం కూడా అలాగే చదివాడు. ఐపీఎస్ అయ్యాడు. కానీ ఐఏఎస్ కావాలనేది అతని లక్ష్యం. ఎన్ని సార్లు రాసినా కాలేకపోయాడు. ఇక కష్టపడి చదవలేక ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ అడ్డదారి తొక్కి పోలీసులకు చిక్కాడు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఏఎస్పీగా పనిచేస్తున్న సఫీర్ యూపీఎస్సీ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో ఉన్న తన భార్య జాయిస్ సమాధానాలు చెబుతుండగా బ్లూటూత్ ద్వారా వింటూ సమాధానాలు రాశాడు. వీరిద్దరికీ హైదరాబాద్ లోని లా ఎక్సలెన్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాంబాబు సహాయం చేసినట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రం వద్దే సఫీర్ను అరెస్టు చేసిన పోలీసులు, తర్వాత అతని భార్య, రాంబాబులను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి ల్యాప్‌టాప్, బ్లూటూత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
రెండేళ్ల క్రితం నుంచే ఇలా కాపీయింగ్‌కి పాల్పడాలని సఫీర్ ప్రణాళిక వేసుకున్నాడు. డార్క్‌నెట్‌లో వెతికి ఛాతికి సమీపంలో అమర్చుకునే మైక్రోకెమెరా, ఫోన్‌తో కూడిన పరికరాన్ని తెప్పించుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా ఈ పరికరం ప్రశ్నాపత్రాన్ని గూగుల్ డ్రైవ్‌కి పంపిస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాని సమాధానాలను మైక్రోఫోన్ ద్వారా అతనికి చెప్పవచ్చు. అందుకోసం తన భార్య సహకరించేది.
ప్రిలిమ్స్ పరీక్ష కూడా సబీర్ ఇలాగే రాసి ఉత్తీర్ణుడైనట్లు తెలుస్తోంది. ఒకవేళ అవతలి వాళ్లు చెప్పేది వినిపించకపోతే `ది వాయిస్ నాట్ ఆడిబుల్ (నీ మాటలు సరిగా వినపడటం లేదు)` అని రాసేవాడట. ఈ పరీక్షకు ముందు పరికరాన్ని తన సోదరి ఇస్రో సహాయ శాస్త్రవేత్త పరీక్షలో ప్రయోగించాడు. ఈ పరికరం ద్వారా ఆమెకు సమాధానాలు చెప్పి పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యేందుకు సహకరించాడు.