ఎన్టీఆర్: ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు కబ్జా చేశారు.. రేవంత్ ధైర్యవంతుడు!: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ విధానాలను కొనసాగించని బాబు
  • అందుకే, బోండా ఉమ నాపై విమర్శలు  
  • ఇద్దరు సీఎంలు ఒకటయ్యారు  
  • వైసీపీ నేత లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబునాయుడు కబ్జా చేశారని, ఎన్టీఆర్ విధానాలను కొనసాగించడం లేదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఎయిడెడ్ కాలేజీల్లోని అధ్యాపకుల సంఘం సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపనలకే పరిమితమైపోయారని, టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బోండా ఉమ పదవుల కోసం పాకులాడుతూ సీఎం దృష్టిలో పడాలని చెప్పి తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ ధైర్యవంతుడని, చంద్రబాబు కోసం జైలుకు కూడా వెళ్లాడని అన్నారు. ఇద్దరు సీఎంలు ఒకటవడంతో రేవంత్ పార్టీ వీడారని ఆమె అభిప్రాయపడ్డారు. తన అనుమతి లేకుండా తన పేరుతో సినిమా తీస్తే కోర్టుకు వెళ్తానని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News