గరికపాటి నరసింహారావు: జడలో ఎంత అర్థముందంటే..! : గరికపాటి నరసింహారావు వివరణ
- జడలో మూడు పాయలు అంటే సత్త్వ,రజో, తమో గుణాలు
- మనలో ఉండే త్రిగుణాలను మెలిపెట్టే జీవితాన్ని సాధించాలి
- మహిళ మీదే జగత్ ఆధారపడి ఉంది
- కోటి దీపోత్సవంలో గరికపాటి అనుగ్రహ భాషణం
మహిళలు వేసుకునే జడను మూడు పాయలుగా వేస్తారని, దీని గురించి అర్థమైతే జగత్ అర్థమవుతుందని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మహిళలందరూ చక్కగా జడలు వేసుకుని, పెద్ద వాళ్లు కొప్పులు పెట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని కాపాడితే, వారి గౌరవం మరింత పెరుగుతుందని, ప్రపంచం మరింతగా అర్థమవుతుందని అన్నారు. హైందవ సంప్రదాయం మూర్తీభవించే విధంగా మహిళల వేషధారణ, మనస్తత్వం అన్నీ ఉంటే బాగుంటాయని అభిప్రాయపడ్డారు.
‘మహిళ మీదే జగత్ ఆధారపడి ఉంది..మహిళే జగత్. మీ సోదరుడిగా నేనొక విజ్ఞప్తి చేస్తున్నా. జడలో ఎంత అర్థముందంటే.. ఇందులో మూడు పాయలు ఉన్నాయి. ఎప్పుడూ మూడు పాయల్లో రెండు పైకి కనబడతాయి. ఒక పాయ ఎప్పుడూ కిందే ఉంటుంది. అలాగే, మనలో కూడా మూడు పాయలు అంటే సత్త్వ,రజో, తమో గుణాలు ఉన్నాయి. ఆ మూడింటిలో ఒక గుణం ఎప్పుడూ కింద ఉంటుంది, రెండు గుణాలు పైకి కనబడుతూ ఉంటాయి.
కింద ఉండే గుణం మనలోనుంచి పోయిందని ఎప్పుడూ అనుకోకూడదు. కొంతమంది పైకి మంచిగా కనపడుతూ ఉంటారు. లోపల మాత్రం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పైకి ఒక రకంగా ఉంటారు కానీ, లోపల చాలా మంచివాళ్లుగా ఉంటారు. అందుకని, అలా ఉండే మన జీవితాలను చక్కగా చేసుకోవాలంటే..మూడు ఒత్తులను మెలిపెట్టి ఒక ఒత్తిగా చేసి దీపం పెట్టమని చెబుతారు. నూనె ఎప్పుడూ వంకరటింకరగా ప్రవహిస్తుంది. కనుక, ఆ నూనెకు అనుకూలంగా ఉండేందుకు ఈ ఒత్తిని ఉంచాలి. అంటే, మనలో ఉండే త్రిగుణాలను మెలిపెట్టే జీవితాన్ని సాధించాలి. ఏ గుణాన్నీ మనం వదులుకోవలసిన అవసరం లేదు’ అని ఆయన తన అనుగ్రహ భాషణం కొనసాగించారు.