కేటీఆర్: చైతన్యపురి కార్పొరేటర్ కు మంత్రి కేటీఆర్ వార్నింగ్!
- చైతన్యపురి నీ సామ్రాజ్యమనుకుంటున్నావా?
- ఇష్టానుసారం ప్రవర్తిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా
- కార్పొరేటర్ పై మండిపడ్డ కేటీఆర్
హైదరాబాద్ కు చెందిన చైతన్యపురి కార్పొరేటర్ కు మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ‘చైతన్యపురిలో అధికారులు తిరగాలంటే అనుమతి కావాలా? ఇదేమన్నా, నీ సామ్రాజ్యమని అనుకుంటున్నావా? ఎక్కువ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా’ అని సదరు కార్పొరేటర్ ను కేటీఆర్ హెచ్చరించినట్టు తెలుస్తోంది.
కాగా, హైదరాబాద్ నగర టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో బేగంపేటలోని హరితప్లాజాలో కేటీఆర్ సమావేశమయ్యారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి ఉందని, ఈ దిశగా జీహెచ్ఎంసీని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్లలో సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు ప్రస్తావించే సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు.