టీడీపీ నేత పెద్దిరెడ్డి: రేవంత్ రెడ్డి ఆవేదన, బాధతో లేఖ రాశారు: టీడీపీ నేత పెద్దిరెడ్డి
- పార్టీని మారిన వారి గురించి విమర్శలు చేయదలుచుకోవడం లేదు
- తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుంటాం
- ఎన్నికలకు చాలా సమయం ఉంది, అప్పుడే పొత్తుల గురించి మాట్లాడడం ఏంటి?
టీడీపీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత పెద్దిరెడ్డి స్పందించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీని మారిన వారి గురించి తాము విమర్శలు చేయదలుచుకోవడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు తాను సమాధానం చెప్పదలుచుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ నేతలు పోరాటం చేస్తారని, తెలుగు దేశం పార్టీ తెలంగాణలో బలహీనపడబోదని ధీమా వ్యక్తం చేశారు.
తమ బలాన్ని నిరూపించుకుంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో చూస్తారని అన్నారు. ప్రతిపక్షం ఎక్కడుందీ? అని టీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు అంటున్నారని, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని, అప్పుడే పొత్తుల గురించి మాట్లాడడం ఏంటని అన్నారు.
రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం అని, అందులోకి వెళితే ఏమవుతుందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎంతో ఆవేదన, బాధతో రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి లేఖ రాశారని అన్నారు. టీడీపీలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. తమ పార్టీని తెలంగాణలో బలపర్చుతామని చెప్పారు.