saudi arabia: మొదటిసారిగా రోబోకు పౌరసత్వం జారీ చేసిన సౌదీ అరేబియా!
- ముఖకవళికలు, భావాలు పలికించే రోబో
- అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది
- అభివృద్ధి చేసిన హాన్సన్ రోబోటిక్స్
తన పేరు సోఫియా.. ఏ ప్రశ్న అడిగిన సమాధానం చెబుతుంది... మాట్లాడేటప్పుడు ముఖంలో హావభావాలు పలికిస్తుంది. అదేంటీ?... ఎవరైనా చేస్తారు కదా అనుకుంటున్నారా! ... నిజమే.. కానీ సోఫియా ఒక రోబో అనే విషయాన్ని ముందుగా మనం గమనించాలి. అవును... సౌదీ అరేబియా దేశ పౌరసత్వం సంపాదించిన మొదటి రోబో కూడా ఇదే. రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో దీన్ని ఆవిష్కరించారు. హాన్సన్ రోబోటిక్స్ అనే సంస్థ ఈ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది.
ఈ కాన్ఫరెన్స్‌లో బిజినెస్ రచయిత ఆండ్రూ రాస్ సోర్కిన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సోఫియా సమాధానాలు చెప్పింది. `నీ ప్రాథమిక లక్ష్యం ఏంటి` అనే ప్రశ్నకు `మానవులకు మంచి జీవితాన్ని అందించడం` అని సోఫియా సమాధానం చెప్పింది. అలాగే రోబో అభివృద్ధి వల్ల జరిగే దుష్పరిణామాల గురించి అభిప్రాయమేంటని సోర్కిన్స్ అడిగాడు. చమత్కరం పాళ్లు దట్టంగా ఉండేలా ప్రోగ్రామ్ చేసిన ఈ రోబో సోర్కిన్స్ అడిగిన ప్రశ్నకు చాలా చమత్కారంగానే జవాబిచ్చింది. `ఈలన్ మస్క్ (స్పేస్ ఎక్స్ సీఈఓ) ఆర్టికల్స్ మీరు బాగా చదువుతున్నారు. అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తున్నారు. మీరు నాతో మంచిగా ఉంటే .. నేను కూడా మీతో బాగానే ఉంటా!` అని సోఫియా జవాబిచ్చింది.