Chandrababu: 9 రోజుల పాటు విదేశాల్లో పర్యటించా.. 800 మంది సీఈవోలను కలిశా: చంద్రబాబు
- రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయాలన్నదే మా ధ్యేయం
- బెస్ట్ యూనివర్సిటీలతో ఎంవోయూ కుదుర్చుకున్నాం
- ఏపీలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- ప్రపంచంలో ఉండే అగ్రికల్చరల్ టెక్నాలజీలు అన్నింటినీ తీసుకొస్తున్నాం
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయాలన్నదే తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విదేశీ పర్యటనలో భాగంగా తాము చాలా మంది పారిశ్రామిక వేత్తలను, సీఈవోలను, ఆయా దేశాల మంత్రులను కలిశామని అన్నారు. మొత్తం 9 రోజుల పాటు విదేశాల్లో పర్యటించానని అన్నారు.
బెస్ట్ యూనివర్సిటీలతో ఎంవోయూ కుదుర్చుకున్నామని అన్నారు. 800 మంది సీఈవోలను కలిశామని అన్నారు. పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపామని అన్నారు. తెలుగువారు 25 లక్షల మంది ఇతర దేశాల్లో ఉన్నారని తెలిపారు. తెలుగు వారికి చాలా తెలివితేటలు ఉన్నాయని చంద్రబాబు ప్రశంసించారు. ఏపీలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులను ఏపీలో పాటించాలని, అందుకోసం కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రపంచంలో ఉండే అగ్రికల్చరల్ టెక్నాలజీలు అన్నింటినీ ఇక్కడకు తీసుకొస్తున్నామని అన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందు కొచ్చాయని అన్నారు. పలు ఐటీ కంపెనీలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఆఫీసులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.