హన్సిక: బాలీవుడ్ బుల్లితెర నటిపై హన్సిక ఆగ్రహం!
- దక్షిణాది హీరోయిన్లపై విమర్శలు చేసిన బుల్లితెర నటి హీనాఖాన్
- ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారన్న నటి
- మండిపడ్డ హన్సిక..‘ట్విట్టర్’ లో హితవు
ప్రస్తుతం ప్రసారం అవుతున్న హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ -11 లో బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ కాంటెస్టెంట్ గా ఉంది. ఓ సందర్భంలో దక్షిణాది నటీమణుల గురించి ఈ షోలో ఆమె వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దక్షిణాది భామలు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో దక్షిణాది ముద్దుగుమ్మ హన్సిక కూడా హీనాఖాన్ పై మండిపడింది. హన్సిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీనాఖాన్ కు హితవు పలికింది. బాలీవుడ్ కు చెందిన పలువురు నటీమణులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పనిచేశారని, ప్రస్తుతం పనిచేస్తున్నారనే విషయం హీనాఖాన్ కు తెలియదా? అని ప్రశ్నించింది. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన హీనా ఖాన్ సిగ్గు పడాలని, ఆమె చెప్పిన మాటలన్నీ పనికిమాలిన మాటలేనని పేర్కొంది. తాను దక్షిణాది నటిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని హన్సిక తన వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చింది.