pakistan: పాకిస్థాన్ అత్యంత ప్రమాదకారి... ప్రపంచానికే ముప్పు ఉంది: యూఎస్ మాజీ సెనేటర్ సంచలన వ్యాఖ్యలు
- అణ్వాయుధాలపై పాక్ కు నియంత్రణ లేదు
- ఆయుధాలను దొంగిలించి, ఉగ్రవాదులకు అమ్మే అవకాశం
- సైన్యం నుంచి ఉగ్రవాదులు కొనుగోలు చేసే అవకాశం
ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా కంటే పాకిస్థానే అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా మాజీ సెనేటర్ లారీ ప్రెస్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణుబాంబులను నియంత్రించే కేంద్రీకృత వ్యవస్థ ఆ దేశం వద్ద లేదని ఆయన అన్నారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను దొంగిలించి ఇతర దేశాలకు, ఉగ్రవాదులకు అమ్ముకునే అవకాశం ఉందని... దీనివల్ల ప్రపంచానికే ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరించారు. అమెరికా ఆయుధ నియంత్రణ సబ్ కమిటీకి లారీ ప్రెస్లర్ గతంలో ఛైర్మన్ గా వ్యవహరించారు.
పాక్ లోని అణ్వాయుధాలను ఆ దేశ సైన్యం నుంచి ఉగ్రవాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని... ఆ ఆయుధాలను అమెరికా మీదే ప్రయోగించే ప్రమాదం కూడా ఉందని ప్రెస్లర్ అన్నారు. ఇది కేవలం అమెరికాను మాత్రమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని భయపెట్టే అంశమని తెలిపారు. ఈ కారణాల వల్లే పాకిస్థాన్ కు ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆపేసిందని... భారత్ కు అమెరికా దగ్గర కావడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు. అణ్వాయుధాలపై నియంత్రణ లేని దేశం పాకిస్థాన్ అని అన్నారు.