china: చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియాతో జపాన్ చర్చలు
- త్వరలోనే డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే భేటీ
- జపాన్ వ్యూహ ప్రణాళికను షింజో అబే ప్రతిపాదిస్తారు
- జపాన్ విదేశాంగ మంత్రి టారో కోనో వెల్లడి
చైనాను అడ్డుకునేందుకు తమ దేశం భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిసి వ్యూహాలు రచించాలని చూస్తోందని జపాన్ విదేశాంగ మంత్రి టారో కోనో తెలిపారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ వ్యూహ ప్రణాళికను ఆయన ప్రతిపాదిస్తారని ఆయన తెలిపారు.
జపాన్, భారత్, అమెరికా, ఆస్ట్రేలియాల దేశాల నేతలతో ఈ ప్రతిపాదనలపై చర్చించాలని తాము అనుకుంటున్నట్లు తెలిపారు. 'వన్ బెల్ట్, వన్ రోడ్' విధానంతో చైనా తన వాణిజ్య విస్తరణను పెంచుకునే యత్నాలు చేస్తోన్న నేపథ్యంలో జపాన్ ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు మౌలిక వసతుల పెట్టుబడులను పెంచడమే తమ ధ్యేయమని జపాన్ విదేశాంగ మంత్రి చెప్పారు.