ఎర్రబెల్లి: కొండా సురేఖ దంపతులు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న ఎర్రబెల్లి వర్గీయులు!
- ఎర్రబెల్లి సోదరులను ‘ఎర్రబల్లులు’గా పోల్చిన కొండా సురేఖ దంపతులు
- మండిపడుతున్న ఎర్రబెల్లి వర్గీయులు
- హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం!
టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సోదరుడు ప్రదీప్ రావుపై అదే పార్టీకి చెందిన కొండా సురేఖ దంపతులు వరంగల్ లో నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎర్రబెల్లి సోదరులను ‘ఎర్రబల్లులు’ అని విమర్శిస్తూ కొండా సురేఖ దంపతులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో సమావేశమైన నాయకులు ఈ విషయమై చర్చించారు. నాడు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన సురేఖ గెలుపు కోసం తాము పాటు పడ్డామని, ఈ విషయాన్ని మర్చిపోయి తమపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను కొండా దంపతులు దెబ్బతీస్తున్నారని ప్రదీప్ రావు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వీరు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, గత కొంతకాలంగా ఎర్రబెల్లి, కొండా సురేఖ కుటుంబాల మధ్య వైరం ఉంది.