రామ్ గోపాల్ వర్మ: ఇది నమ్మని వాళ్లందరూ కచ్చితంగా నరకానికి పోతారని ఎన్టీఆర్ చెప్పమన్నారు: రామ్ గోపాల్ వర్మ
- ఓ వీడియోను పోస్ట్ చేసిన దర్శకుడు వర్మ
- ‘రామ్ గోపాల్ వర్మ గారూ!’ అంటూ ఎన్టీఆర్ వాయిస్
- మరోమారు వర్మ చమత్కారం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీయడానికి తనకు అపారమైన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే ఎన్టీఆర్ అని, ఆ మహానుభావుడి ఆత్మ రోజూ తన కలలోకి వచ్చి తనకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చమత్కరించిన విషయం తెలిసిందే.
తాజాగా, అదే తరహాలో మరోమారు చమత్కరించారు.ఈసారి మాత్రం ఓ వీడియోను తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో వర్మ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వర్మ గురించి, ఆయన తీయనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ వాయిస్ వినపడుతుంది. ‘సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే నాకీ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్లందరూ కచ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు’ అని వర్మ తన పోస్ట్ లో పేర్కొంటూ ఈ వీడియోను జతపరచడం గమనార్హం.
‘రామ్ గోపాల్ వర్మ గారూ!, మిత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారు పరిచయం చేయగా గతంలో మీరొకసారి మమ్మల్ని కలిశారు. మేము కరచాలనం చేశాం. మీ ప్రతిభను గురించి, మీ మేథస్సును గురించి, మీ ప్రజ్ఞాపాటవాలను గురించి, మీ వ్యక్తిత్వాన్ని గురించి అక్కినేని నాగేశ్వరరావుగారు ఆనాడే నాకు మీ పరోక్షంలో వివరించారు. నేను ఇలా అశరీరవాణిలా మీకు వినిపించడానికి కారణం మీరు మాపై తీస్తున్న చలనచిత్రం. మరుగునపడబోతున్న చారిత్రక సత్యాలను మరుగున పెడుతున్నవారు బతికుండగానే తెరకు ఎక్కించే ప్రయత్నం చేయడం నిజంగా సాహసం..సాహసం..సాహసం. మీ సాహసాన్ని ప్రశంసించడంతో పాటు మీకు, ఈలోకానికి, నా అర్థాంగి లక్ష్మికి కూడా తెలియని కొన్ని అతిముఖ్యమైన విషయాలను మీకు చెప్పదలచాను....ఎప్పుడేది అవసరమో మాకే తెలియును గనుక ఆ విషయాలను మేమే ఇలా అశరీరవాణి ద్వారా మీకు మాత్రమే వినిపించేలా చెబుతాం.. ఇకపై మా ఏకాంత సంభాషణ మీతోనే!’ అని ఆ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుంది.