twitter: ట్వీట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ చేసిన బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్... మండిపడిన నెటిజన్లు
- సంగీత కళాకారిణి గిరిజా దేవి మరణానికి సంతాపం తెలిపిన జావేద్
- సింగర్‌కి బదులు సిన్నర్ అని టైప్ చేసిన గీత రచయిత
- క్షమాపణలు తెలిపినా వదిలిపెట్టని ట్విట్టర్ జనం
సెలబ్రిటీలు అప్పుడప్పుడు ట్వీట్లలో స్పెల్లింగ్ తప్పులు చేయడం సాధారణమే. కానీ ఆ స్పెల్లింగ్ తప్పుల వల్ల అర్థం మారిపోయినపుడే అసలు సమస్య మొదలవుతుంది. రచయితలు, గీత రచయితలు తప్పుడు అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తే ఇక అంతే సంగతులు... నెటిజన్లు వారితో ఆడుకుంటారు. బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కూడా అలాంటి పొరపాటే చేశారు. సంగీత కళాకారిణి గిరిజా దేవి మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్‌లో `సింగర్`కి బదులుగా `సిన్నర్` అని రాశారు. `సిన్నర్` అంటే ఆంగ్లంలో పాపం చేసినవారు. అలాగే `ట్రెజర్`కి బదులుగా `ట్రెజరర్` అని రాశారు. ట్రెజర్ అంటే నిధి, ట్రెజరర్ అంటే కోశాధికారి అని అర్థం.
అయితే ఇలా చనిపోయినవారి విషయంలో అర్థం మారేలా ట్వీట్ చేసినందుకు నెటిజన్లు జావేద్ మీద విరుచుకుపడ్డారు. ఆల్కహాల్ సేవించి ట్వీట్లు చేస్తే ఇలాగే ఉంటుందని హేళన చేశారు. ఈ విషయం గురించి తన తప్పు గ్రహించి జావేద్ అక్తర్ మరో ట్వీట్‌లో క్షమాపణలు తెలియజేశారు. అయినప్పటికీ ట్విట్టర్ జనం అతన్ని హేళన చేయడం మానలేదు.