ys jagan: ఈ అసెంబ్లీ మనకొద్దు... బహిష్కరిద్దాం.. సంచలన నిర్ణయం తీసుకున్న వైకాపా!
- లోటస్ పాండ్ లో ముగిసిన వైకాపా ఎల్పీ భేటీ
- వివరాలను మీడియాకు వెల్లడించిన పెద్దిరెడ్డి
- పాదయాత్రను అడ్డుకునేందుకే అసెంబ్లీ
- ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటే అసెంబ్లీకి
త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉదయం హైదరాబాద్, లోటస్ పాండ్ లో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరుగగా, జగన్ సహా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొని తాజా రాజకీయ పరిస్థితులు, నవంబర్ 6 నుంచి తలపెట్టిన పాదయాత్రలపై చర్చించారు. జగన్ పాదయాత్రను తలపెట్టిన తరువాత, దాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పలువురు నేతలు ఆరోపించారు.
పాదయాత్ర తేదీలను ముందుగా చెబుతున్నామని, నవంబర్ లోగా శీతాకాల సమావేశాలను ముగించే అవకాశాలున్నా, తెలుగుదేశం పట్టించుకోలేదని వైకాపా ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం జగన్ తలపెట్టిన పాదయాత్రకే ప్రాధాన్యం ఇవ్వాలని అత్యధిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడటంతో ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వైకాపా ఎల్పీ సమావేశం వివరాలను ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడిస్తూ, పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ కోడెల విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. పైగా వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆయన విమర్శించారు. పైగా మంత్రి పదవి చేపట్టిన వారిని వైకాపాలో ఉన్నట్టు అసెంబ్లీ రిజిస్టర్ లలో చూపుతున్నారని, ఇంతకన్నా దౌర్భాగ్యమైన విషయం మరొకటి ఉండదని నిప్పులు చెరిగారు. వైకాపా టికెట్ పై గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన 20 మందిపై చర్యలు తీసుకోవాలని కూడా కొందరు నేతలు జగన్ ను కోరారు. ఆ 20 మందిపై చర్యలు తీసుకుంటే సభకు హాజరయ్యే అంశాన్ని ఆలోచిస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.