passport: ప్రపంచంలో అతిశక్తిమంతమైన పాస్‌పోర్ట్ ఏ దేశానిదో తెలుసా?
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2017 జాబితా వెల్లడి
- ప్రథమ స్థానంలో సింగపూర్
- భారత్ స్థానం - 75
- వీసా ఫ్రీ అర్హత ఆధారంగా జాబితా తయారీ
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ అందించే దేశంగా సింగపూర్ నిలిచింది. అంతర్జాతీయ ఆర్థిక సలహా సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసిన `గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2017` జాబితాను వెల్లడించింది. ఇందులో మొదటి స్థానం దక్కించుకున్న మొదటి ఆసియా దేశంగా సింగపూర్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ, స్వీడన్, దక్షిణ కొరియాలు నిలిచాయి. ఈ జాబితాలో భారత పాస్‌పోర్టు 75వ స్థానంలో నిలిచింది.
వీసా ఫ్రీ అర్హతల ఆధారంగా ఆర్టన్ క్యాపిటల్ ఈ జాబితాను తయారు చేసింది. అంటే ఇతర దేశాలకి వెళ్లడానికి కేవలం పాస్‌పోర్టు ఉంటే చాలు... వీసా అవసరం లేదు. ఇటీవల సింగపూర్ దేశీయులకు పరాగ్వే దేశం వీసా ఫ్రీ పర్యటనను జారీ చేసింది. దీంతో 159 వీసా ఫ్రీ స్కోరు సాధించి సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా మొదటి స్థానంలో ఉన్న జర్మనీ రెండో స్థానానికి పడిపోయింది.
అలాగే గతేడాది 78వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికన్లకు కొన్ని దేశాలు వీసా ఫ్రీ హక్కులను తొలగించాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికా పాస్‌పోర్ట్ స్థానం దిగజారింది. ఇక అట్టడుగున ఉన్న దేశాలుగా ఆఫ్ఘనిస్థాన్ (94), పాకిస్థాన్ (93), సిరియా (92) నిలిచాయి.