Gutkha: గుట్కా రారాజు 'మాణిక్ చంద్' ధరివాల్ కన్నుమూత!
- గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ధరివాల్
- మాణిక్‌చంద్ గుట్కాతో పేరు ప్రఖ్యాతులు
- వ్యవస్థీకృత నేరాల కేసు ఎదుర్కొంటున్న ధరివాల్
గుట్కా రారాజు రసిక్‌లాల్ మాణిక్‌చంద్ ధరివాల్ (80) కన్నుమూశారు. గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి పుణెలో మృతి చెందారు. 2004లో ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్స్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కింద కేసు నమోదు చేసింది. ధరివాల్ మరణంతో ఈ కేసు ఇక మూతపడే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాది హితేశ్ జైన్ తెలిపారు.
పాకిస్థాన్‌లోని కరాచీలో గుట్కా తయారీ కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారంటూ ధరివాల్, జోషిలపై గతేడాది సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సన్నిహితుడైన ఓ వ్యక్తి విచారణలో భాగంగా ధరివాల్, జోషిల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ధరివాల్‌ను పోలీసులు ఎప్పుడూ అదుపులోకి తీసుకోలేదు. తన ఆరోగ్యం బాగాలేదని, తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ధరివాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ధరివాల్ మరణంతో ఎంసీఓసీఏ కేసు నుంచి ఆయన బయటపడినట్టే. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎం జోషిపై తదుపరి విచారణ సాగనున్నట్టు తెలుస్తోంది.