donald trump: చనిపోయిన సైనికాధికారి భార్యను అవమానించిన డొనాల్డ్ ట్రంప్
- సైనికాధికారి కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్
- సైనికాధికారి పేరు తెలియదన్న అమెరికా అధ్యక్షుడు
- మర్యాదగానే మాట్లాడానని ట్వీట్ చేసిన ట్రంప్
ఇటీవల ఆఫ్రికాలోని నైజర్ దేశంలో జరిగిన దాడుల్లో నలుగురు అమెరికా అమెరికా సైనికులు మృత్యువాతపడ్డారు. వారి కుటుంబాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. అందులో భాగంగా దాడిలో మృతి చెందిన సార్జెంట్ డేవిడ్ టి.జాన్సన్ కుటుంబానికి కూడా ట్రంప్ కాల్ చేశారు. అయితే ఫోన్లో మాట్లాడుతున్న జాన్సన్ భార్య మెయ్షియాతో ఆయన అవమానకరంగా మాట్లాడారు. ఆమె భర్త పేరును సంబోధించకుండానే ట్రంప్ మాట్లాడారు. అంతేకాకుండా అసలు ఆమె భర్త పేరే తనకి తెలియదని అన్నారు. దీంతో ట్రంప్ తమని అవమానించారంటూ ఆమె తీవ్రంగా బాధపడింది. ఈ విషయాన్ని జాన్సన్ తల్లి కోవాండా మీడియాకు వెల్లడించారు.
అధ్యక్షుడు తన భర్త పేరు తెలియదనడంతో తనకు ఏడుపొచ్చేసిందని మెయ్షియా ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ట్రంప్.. జాన్సన్ కుటుంబంతో ఫోనులో మాట్లాడుతున్నప్పుడు తాను విన్నానని డెమోక్రటిక్ కాంగ్రెస్ మహిళ ఫ్రెడెరికా విల్సన్ తెలియజేశారు. ట్రంప్ నిజంగానే జాన్సన్ కుటుంబాన్ని అవమానించారని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలకు స్పందించిన ట్రంప్ జాన్సన్ కుటుంబీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జాన్సన్ పేరును చాలా సార్లు మాటల్లో ఉపయోగించానని, విల్సన్ కావాలని కల్పించి చెబుతోందని ఆయన ట్వీట్ చేశారు.