hardh: రాహుల్ గాంధీని సీక్రెట్ గా కలిసిన హార్దిక్ పటేల్!
- స్వయంగా వెళ్లి చర్చించిన హార్దిక్
- రాహుల్ బస చేసిన హోటల్ కు హార్దిక్
- సీసీటీవీ ఫుటేజీల్లో వచ్చి వెళుతున్న దృశ్యాలు
- కలిస్తే బహిరంగంగానే కలుస్తానంటున్న హార్దిక్
గుజరాత్ యువనేత, పటీదార్ వర్గం నేత హార్దిక్ పటేల్ స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రహస్యంగా చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలంటే వయసు తక్కువగా ఉన్న హార్దిక్, ప్రస్తుతానికి కాంగ్రెస్ కు బయటి నుంచి సాయం చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీనగర్ పర్యటనలో భాగంగా జరిగిన ర్యాలీలో ఓబీసీ నేత అల్పేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, అదే రోజు హార్దిక్ కూడా రాహుల్ ను కలిసినట్టు సమాచారం. కాగా, తను రాహుల్ ను కలవాలని భావిస్తే, బహిరంగంగానే కలుస్తానని, సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటని హార్దిక్ నిన్న ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అహ్మదాబాద్ కు 87 కిలోమీటర్ల దూరంలోని మండల్ పట్టణానికి హార్దిక్ ముందే చేరుకున్నారని, ఆపై తన ర్యాలీలో భాగంగా అక్కడికి వచ్చిన రాహుల్ ను రాత్రి 7.30 గంటల సమయంలో కలిశారని తెలుస్తోంది. ఇక రాహుల్ బస చేసిన హోటల్ కు హార్దిక్ వచ్చి వెళుతున్నట్టు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లు మీడియాలో ప్రసారమవుతున్నాయి. ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన నిఖిల్ సవానీతో కలసి వచ్చిన హార్దిక్, రాహుల్ ను కలిసినట్టు తెలుస్తోంది. కాగా, మరో సీసీటీవీ ఫుటేజ్ లో హార్దిక్ మాట్లాడుతూ, తాను రాహుల్ ను కలవలేదని, ఆ పార్టీ నేత అశోక్ గెహ్లాట్ ను మాత్రం కలిశానని అంటున్నట్టు ఉండటం గమనార్హం.