kebab: ప్రపంచంలో అతిపెద్ద కబాబ్... బరువు 423 కేజీలు!
- బెర్లిన్ షాపింగ్ సెంటర్లో రికార్డు యత్నం
- గత రికార్డును బ్రేక్ చేయడంలో సఫలం
- గత రికార్డు 413 కేజీలు
జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఓ షాపింగ్ సెంటర్లో ప్రపంచంలో అతిపెద్ద కబాబ్‌ను తయారుచేసి రికార్డు సృష్టించారు. దీని బరువు అక్షరాల 423 కేజీలు. నిజానికి టన్ను బరువుండే కబాబ్ తయారు చేయడానికి ప్రయత్నించారు కానీ, అది విరిగిపోవడంతో 423 కేజీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ గత కబాబ్ రికార్డును ఈ భారీ కబాబ్ బ్రేక్ చేసింది. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో 413 కేజీల కబాబ్ పేరున ఉన్న రికార్డును ఈ భారీ కబాబ్ బ్రేక్ చేసిందని రికార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జర్మనీ తెలిపింది.
మాంసం, బ్రెడ్, వెజిటబుల్ సలాడ్, క్యాబేజీలు వేసి ఈ కబాబ్‌ను తయారు చేశారు. అయితే దీన్ని ఆరగించడానికి తోడుగా వెల్లుల్లి సాస్‌కి బదులుగా మూలికల సాస్ అందజేశారు. శవర్మా అని కూడా పిలిచే ఈ చిరుతిండిని 1972లో టర్కీ నుంచి వచ్చిన ఖాదిర్ నూర్మాన్ జర్మనీకి పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఈ వంటకం అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది.