Nawaz sharif: నన్ను హత్య చేయడానికి రెండుసార్లు ప్రయత్నించారు!: నవాజ్ షరీఫ్‌పై మాజీ అధ్యక్షుడు జర్దారీ సంచలన ఆరోపణలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-53fb8683e3982dad42a31363c78ffc2d0195a576.jpg)
- తనను హత్య చేసేందుకు రెండుసార్లు పథకం రచించారన్న జర్దారీ
- నవాజ్, షానబాజ్లు ఊసరవెల్లి టైపని వ్యాఖ్య
- వారు చేసిన అన్యాయం ఇప్పటికీ గుర్తుందన్న మాజీ అధ్యక్షుడు
పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (62) సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్ ఆయన సోదరుడు షాన్‌బాజ్ షరీఫ్‌లు ఇద్దరూ కలిసి తనను హత్య చేసేందుకు రెండుసార్లు కుట్రచేశారని ఆరోపించారు. 1990లలో అవినీతి ఆరోపణల కేసులో తాను ఎనిమిదేళ్లపాటు జైలులో ఉన్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తన హత్యకు పథకం రచించారన్నారు. విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు హాజరయ్యే సమయంలో తనను హత్య చేయాలనుకున్నారని జర్దారీ పేర్కొన్నారు. లాహోర్‌లోని బిలావల్ హౌస్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు.
నవాజ్ షరీఫ్ తనతో సంబంధాలు పెట్టుకునేందుకు కూడా ప్రయత్నించారని, అయితే తాను తిరస్కరించానని పేర్కొన్నారు. తనకు, తన భార్య బేనజిర్ భుట్టోకు వ్యతిరేకంగా వారు ఏం చేశారో తానింకా మర్చిపోలేదన్నారు. అయితే తాము వారిని క్షమించామన్నారు. పనామా కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారిని ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారు త్వరగా రంగులు మార్చేస్తుంటారని ఎద్దేవా చేశారు. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఎవరితోనైనా చేతులు కలిపేందుకు సిద్ధపడతారన్నారు.