బాలీవుడ్ నటుడు: 103 మంది అమర జవాన్ల కుటుంబాలకి రూ.25,000 చొప్పున సాయం చేసిన బాలీవుడ్ హీరో
- నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్
- అమర జవాన్ల పిల్లలకు నోట్ బుక్స్ కూడా అందిస్తానని చెప్పిన హీరో
- ప్రాణ త్యాగం చేసిన జవాన్లని చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్య
సినిమాల్లో హీరో పాత్రలు వేయడమే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కొంత పాటుపడాలనే తపన ఉన్న అక్షయ్.. గతంలో చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో గొప్ప పని చేసి అందిరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. మహారాష్ట్ర కొల్లాపూర్ రేంజ్ స్పెషల్ ఐజీ విశ్వాస్ నంగరె పాటిల్ దీపావళి సందర్భంగా 103 మంది అమర జవాన్ల కుటుంబాలకి స్వీట్లు పంచారు.
విశ్వాస్ నంగరె పాటిల్ చేస్తోన్న కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్.. దీపావళి పండుగ సందర్భంగా తాను ఆ 103 మంది అమర జవాన్ల కుటుంబాలకి కూడా ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. అమర జవాన్ల పిల్లలకు నోట్ బుక్స్ తోపాటు రూ.25,000 చొప్పున ఇస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ఓ లేఖను కూడా పంపిస్తూ.. ప్రాణ త్యాగం చేసిన జవాన్లని చూసి దేశం గర్విస్తోందని అన్నారు.