rape attempt: సర్పంచ్ ను వేధించిన కీచక ఎస్సైపై సస్పెన్షన్ వేటు
- మహిళా సర్పంచ్ ను నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేసిన ఎస్సై
- దీపావళి రోజున అత్యాచారయత్నం
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- తొలుత వీఆర్, తాజాగా సస్పెన్షన్ వేటు
నెల్లూరు జిల్లా వూటుకూరు సర్పంచ్ పద్మజపై కన్నేసి, నాలుగు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ, దీపావళి రోజున ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడిన కీచక ఎస్సై ఏడుకొండలుపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఎస్సై ఏడుకొండలు వూటుకూరు సర్పంచ్ పద్మజపై కన్నేశాడు. నాలుగు నెలలుగా ఆమెను సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర పదజాలంతో వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో దీపావళి సందర్భంగా వూటుకూరు వచ్చిన ఏడుకొండలు, పద్మజ నివాసానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన పద్మజ అతని బారినుంచి తప్పించుకుని, ఇరుగుపొరుగు మహిళల సాయంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫోన్ సంభాషణల వివరాలు ఉన్నతాధికారులకు అందజేశారు.
ఈ నేపథ్యంలో వెంటనే ఆయనను వీఆర్ కు పంపారు. అనంతరం దీనిపై విచారణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు వేధింపులు నిజమని తేల్చడంతో, అతనిని సస్పెండ్ చేస్తూ డీఐజీ కేవీవీ గోపాల్ రావు ఆదేశాలు జారీ చేశారు.