కాఫీ కప్పు: వేడి వేడిగా కమ్మని వాసనతో ఊరిస్తోన్న కాఫీ కప్పులో బొద్దింక కాళ్లు!
- మెక్ డోనాల్డ్స్ లో వినియోగదారుడికి చేదు అనుభవం
- రెండు కప్పుల కాఫీ తెప్పించుకుంటే రెండుసార్లూ బొద్దింక కాళ్లు వచ్చిన వైనం
- సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన థాయిలాండ్ వాసి
కమ్మటి కాఫీ రుచి కోసం మెక్ డోనాల్డ్స్ లోకి వెళ్లిన ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ఇచ్చిన కాఫీలో బొద్దింక కాళ్లు కనపడ్డాయి. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బ్యాంకాక్ కు చెందిన నోస్టాలిక్ ఐక్ (28) అనే వ్యక్తి స్థానికంగా ఉండే మెక్‌డోనాల్డ్స్ కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాడు. ఆ కాఫీలో బొద్దింక కాళ్లు కనిపించడంతో మరో కప్పులో కాఫీ తెప్పించుకున్నాడు.
అయితే, ఈ సారి తెచ్చిన కాఫీలోనూ బొద్దింక కాళ్లు కనపడడంతో ఆయన తన స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. మెక్‌డొనాల్డ్ లో అధిక శుభ్రత పాటిస్తారని తాను అనుకున్నానని, అయితే, ఇటువంటి అనుభవం ఎదురైందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై స్పందించిన మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధులు సదరు వినియోగదారుడికి క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.