ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్: కమలహాసన్ శాస్త్రవేత్త కాదు.. అలా మాట్లాడకూడదు: తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి
- రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్న సినీనటుడు కమలహాసన్
- ప్రభుత్వంపై తరుచూ విమర్శలు
- తిప్పికొట్టిన ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్
రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్న సినీనటుడు కమలహాసన్ తమిళనాడు ప్రభుత్వంపై తరుచూ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర మంత్రులు కూడా ఆయన విమర్శలకు దీటుగా జవాబు ఇస్తున్నారు. ఇటీవల కమలహాసన్ డెంగీ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించే నీలవెంబు వైద్యాన్ని విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
దీనిపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ... కమలహాసన్ శాస్త్రవేత్త కాదని ఎద్దేవా చేశారు. నీలవెంబు వైద్యం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని ఆయన చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురి కాకూడదని ఆయన సూచించారు.