mersal: విజయ్ `మెర్సల్` చిత్రంపై మండిపడుతున్న తమిళ బీజేపీ నేతలు!
- జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను తప్పుగా చూపించారని ఆరోపణ
- మోదీ భావజాలన్ని తప్పుదోవ పట్టించారని వ్యాఖ్య
- సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
తమిళనాడులో కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్న విజయ్ `మెర్సల్` చిత్రం మీద తమిళ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను ఈ సినిమా కించపరుస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన `మెర్సల్` చిత్రంలో మోదీ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను, డిజిటల్ ఇండియా ప్రచారాలను తప్పుగా చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల కారణంగా మోదీ భావజాలాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకుడు టీఎన్ సుందరరాజన్ పేర్కొన్నారు. అలాంటి సన్నివేశాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోపక్క `మెర్సల్` చిత్రంలో భారత్, సింగపూర్ దేశాలను పోల్చుతూ విజయ్ పాత్ర చెప్పిన డైలాగులు తప్పుడుతడకలుగా ఉన్నాయని బీజేపీ యూత్ వింగ్ నేత ఎస్జీ సూర్య ట్విట్టర్లో పేర్కొన్నారు. 7 శాతం జీఎస్టీ అమల్లో ఉన్న సింగపూర్లో ప్రజలకు ఉచిత వైద్యసహాయం అందుతుందని, అదే 28 శాతం జీఎస్టీ కడుతున్నప్పటికీ భారతీయులకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని సినిమాలో ఓ సన్నివేశంలో విజయ్ పాత్ర చెబుతుంది.