jalianwala bagh massacre: జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి థెరెసా మే క్షమాపణలు చెప్పాలని బ్రిటన్ పార్లమెంట్లో తీర్మానం
- ప్రవేశపెట్టిన భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ
- తీర్మానానికి మద్దతు తెలిపిన ఐదుగురు బ్రిటన్ ఎంపీలు
- 2019కి ఘటన జరిగి వందేళ్లు
1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి బ్రిటన్ ప్రధాని థెరెసా మే క్షమాపణలు తెలియజేయాలని కోరుతూ భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటన్ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఐదుగురు బ్రిటన్ ఎంపీల సంతకాలను కూడా వీరేంద్ర శర్మ సేకరించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన జలియన్‌వాలా బాగ్ ఘటనను బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని ఆయన తీర్మానంలో పేర్కొన్నారు.
2019కి ఈ ఘటన జరిగి వందేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఈ ఉదంతానికి సంబంధించి బ్రిటన్ ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమెరూన్ భారత్ పర్యటనకు వచ్చినపుడు జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.