telngana: తెలంగాణ టీడీపీకి షాక్... కాంగ్రెస్ లోకి రేవంత్ తో పాటుగా పలువురు టీడీపీ నేతలు?
- కాంగ్రెస్ గూటికి రేవంత్ రెడ్డి?
- రేవంత్ రెడ్డితోపాటు పలువురు సీనియర్లు జంప్?
- తెలంగాణలో టీడీపీ ఖాళీ?
తెలంగాణలో టీడీపీకి భయంకరమైన షాక్ తగలనుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో కీలక నేతగా పేరొందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడంపై హైకమాండ్ దృష్టిపెట్టింది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ప్రజల్లో దానిని క్యాష్ చేసుకోలేకపోయిందని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించారు. సీనియర్ నేతలతో ఇతర నేతలను సమన్వయం చేస్తూ, సమీక్షించే బాధ్యతలను పలువురికి అప్పగించనున్నారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని, అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని భావించిన ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ తగలనుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.