రేవంత్ రెడ్డి: కేసీఆర్‌కి ఏపీ టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెడతారా?: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- పార్టీ మారనున్న రేవంత్ రెడ్డి
- అనుమానాలను బలపర్చేలా వ్యాఖ్యలు
- మమ్మల్ని జైల్లో పెట్టించిన కేసీఆర్‌కి ఏపీ టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెడతారా?
- అనంతపురంలో కేసీఆర్ కి టీడీపీ నేతలు అంతగా మర్యాదలు చేయడం ఏంటి?
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారతారని వార్తలు వస్తోన్న వేళ.. ఆ అనుమానాలను బలపర్చేలా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తెలిపిన వివరాల మేరకు... ఏపీ మంత్రులు కొందరు అప్పుడప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నారని, వారికి ఈ రాష్ట్రంలో పనేంటని ఆయన అన్నారు. తమని జైల్లో పెట్టించిన కేసీఆర్‌కి ఏపీ టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెడతారా? అని ప్రశ్నించారు. స్థానిక పరిస్థితులను బట్టి తమకు ఇష్టం వచ్చిన పార్టీతో పొత్తులు పెట్టుకునే అధికారాన్ని చంద్రబాబు తమకు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌పై కాంగ్రెస్‌తో కలిసి చాలా కాలం నుంచి పోరాడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీ మంత్రులకు సంబంధించిన కంపెనీలకు అనుమతులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పరిటాల సునీత కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లిన సమయంలో ఏపీ టీడీపీ నేతలు అంతగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని నిలదీశారు. కేసీఆర్ ఏపీకి వస్తే అంతగా మర్యాదలు చేయడం ఏంటని అన్నారు. త్వరలోనే తాను చంద్రబాబును కలుస్తానని అన్నారు.