చిరంజీవి: చిరంజీవికి ఫోన్లో ఆ డైలాగ్ చెప్పగానే తెగ సంతోషపడ్డారు: పరుచూరి గోపాలకృష్ణ

  • ‘ఇంద్ర’ సినిమాలో డైలాగ్స్ గురించి ప్రస్తావించిన గోపాలకృష్ణ
  • ఓ సన్నివేశంలో డైలాగ్ కోసం చిరంజీవి ఫోన్ చేశారు
  • ఆ డైలాగ్ చెప్పగానే చిరంజీవి సంతోషపడిపోయారు

సుమారు పదిహేనేళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఇంద్ర’ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బి.గోపాల్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి మాటలు రాసింది పరుచూరి బ్రదర్స్. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్లో అప్పటికప్పుడు మాటలు రాయాల్సి వచ్చిన సందర్భాలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఈ విషయాలను తన ‘పరుచూరి పలుకులు’ వీడియోలో ప్రస్తావించారు.

‘‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి మేనల్లుడి పాత్రధారిని కట్టేసి కొడుతుంటే..‘నన్ను కొట్టండి. వాడిని పెంచింది నేను’ అని చెప్పి చిరంజీవి గారు దెబ్బలు తింటారు. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అక్కడి నుంచి చిరంజీవిగారు తన సెల్ నుంచి నాకు ఫోన్ చేశారు. ‘ఈ సన్నివేశంలో నేను దెబ్బలు తింటూ ఉంటే నా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమోనని బాధగా ఉంది. ఇక్కడ, ఏదన్నా ఒక డైలాగ్ పడితే బాగుంటుంది’ అని చిరంజీవిగారు అన్నారు.

‘ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తాను సార్’ అన్నాను. ‘లేదు లేదు.. నేనే ఫోన్ చేస్తా. ఈలోపు ట్రై చేయండి’ అని చిరంజీవిగారు అన్నారు. కరెక్టుగా ఐదు నిమిషాల్లో చిరంజీవిగారు ఫోన్ చేశారు. ‘తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నాను. లేకపోతే, తలలు తీసుకుని వెళ్లేవాడిని’ అనే డైలాగ్ ను నేను ఫోన్లో చెప్పగానే, ‘ఎదురుగా ఉంటే కౌగిలించుకునేవాడిని’ అని చిరంజీవి తెగ సంతోషపడిపోయారు’ అని నాటి విషయాలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News