bsnl: 4జీ వీఓఎల్‌టీఈ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన బీఎస్ఎన్ఎల్... ధర రూ. 2,200
- `భారత్ 1` పేరుతో మార్కెట్లోకి
- మైక్రోమ్యాక్స్ సహకారంతో రూపొందించిన బీఎస్ఎన్ఎల్
- అక్టోబర్ 20 నుంచి అమ్మకాలు
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ సహకారంతో `భారత్ 1` అనే 4జీ వీఓఎల్‌టీఈ సదుపాయం గల ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ. 2,200గా నిర్ణయించారు. అక్టోబర్ 20 నుంచి ఈ ఫీచర్ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 2.4 అంగుళాల డిస్‌ప్లేతో పాటు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి. 512ఎంబీ ర్యామ్, 2000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, డ్యూయల్ సిమ్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా 2ఎంపీ వెనక కెమెరా, వీజీఏ క్వాలిటీ షూటర్‌తో ముందు కెమెరా ఉన్నాయి.
పూర్తిగా భారత్‌లోనే తయారైన ఈ ఫీచర్ ఫోన్ 22 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో లైవ్ టీవీ వంటి బీఎస్ఎన్ఎల్ సూట్ సర్వీసెస్‌తో పాటు భీమ్ (భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ) అప్లికేషన్లు ప్రీలోడెడ్‌గా వుంటాయి. ఈ ఫీచర్ ఫోన్ ద్వారా నెలకు రూ. 97 రీఛార్జీతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ వాడుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఫోన్‌ను కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కే పరిమితం చేయకుండా, ఇతర నెట్‌వర్కుల సిమ్ కార్డులు కూడా వేసుకుని వాడుకునేలా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.