dhan teras: ఈ రోజు ధన త్రయోదశి.. కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు!
- నేడు ధన త్రయోదశి
- బంగారం కొనుగోలుకు ప్రజల క్యూ
- ఆకర్షిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు
- 2016తో పోలిస్తే 12 శాతం ఎక్కువ వ్యాపారం!
బంగారం కొనుగోలు చేసేందుకు అత్యంత శుభప్రదమైన రోజుల్లో ఒకటిగా భావించే ధన త్రయోదశి సందర్భంగా నేడు ఆభరణాల దుకాణాలు కస్టమర్ల సందడితో కిటకిటలాడుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ కు ఎక్కువ మంది వెళుతున్నట్టు తెలుస్తోంది. బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా ప్రజలు ఆసక్తిని చూపుతుండటంతో గృహోపకరణాల స్టోర్స్ కూడా కళకళలాడుతున్నాయి.
పలు ఈ-కామర్స్ వెబ్ సైట్లు, జ్యూయెలరీ బ్రాండ్లు ఈ ధన త్రయోదశి సందర్భంగా ఆకట్టుకునే డిస్కౌంట్లను అందించాయి. బంగారు నాణాలపై 10 శాతం వరకూ డిస్కౌంట్ లు, ఒకటి నుంచి 50 గ్రాముల వరకూ వివిధ దేవతా రూపాలను ముద్రించబడ్డ కాయిన్స్ కు డిమాండ్ కనిపిస్తోంది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు 10 నుంచి 12 శాతం వరకూ అదనపు వ్యాపారం సాగుతుందని అంచనా వేస్తున్నామని ఓ గోల్డ్ స్టోర్ యజమాని పేర్కొన్నారు. వర్షాలు అధికంగా పడుతూ ఉండటంతో టపాకాయల విక్రయాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, ఆ డబ్బును బంగారం కొనుగోలుకు వినియోగించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, జోయలుక్కాస్, మలబార్, సెన్కో గోల్డ్, బ్లూస్టోన్, లలితా జ్యూయెలర్స్, జోస్ అలుక్కాస్, కల్యాణ్ జ్యూయెలర్స్ వంటి సంస్థలు వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుండటం కూడా అమ్మకాలను పెంచుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు.