complaint: ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో కేక్ కట్ చేయించిన ముంబై పోలీసులు!
- పోలీస్ స్టేషన్కి వెళ్తే పుట్టిన రోజు చేశారు
- ఎఫ్ఐఆర్లో తేదీ గుర్తించి కేక్ తెప్పించారు
- ముంబై పోలీసుల చాకచక్యం
ప్రజలను గౌరవించడంలో ముంబై పోలీసులకు చాలా మంచి పేరుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో కేక్ కట్ చేయించి వారు ప్రజలను బాగా గౌరవిస్తారని మరోసారి నిరూపించుకున్నారు. ముంబై వాసి అనీష్ ఏదో విషయం గురించి ఫిర్యాదు చేయడానికి సకినాక పోలీసు స్టేషన్కి వచ్చాడు. అక్కడ ఎఫ్ఐఆర్ నింపి పోలీసులకు అందజేశాడు.
తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. వెంటనే ఓ కేక్ తెచ్చి కట్ చేయించి పుట్టిన రోజు వేడుక జరిపారు. ఎఫ్ఐఆర్లో అనీష్ పుట్టిన రోజు తేదీ, ఆ రోజు తేదీ ఒకటే కావడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పుట్టినరోజు వేడుక చేశారు. పోలీసులు అనీష్కి కేకు తినిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసినవారంతా పోలీసుల ఔన్నత్యాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.