north korea: బీ కేర్ ఫుల్.. ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ప్రారంభమవుతుంది: ఉత్తరకొరియా
- అమెరికా మొత్తం మా ఆయుధాల పరిధిలో ఉంది
- దుస్సాహసానికి పాల్పడితే... పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
- అణ్వాయుధాలను కలిగి ఉండటం మా హక్కు
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ... నార్త్ కొరియా డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ప్రారంభమవుతుందని ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా డిప్యూటీ అంబాసడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు. అమెరికా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని.... ఈ నేపథ్యంలో, తమ అణు, క్షిపణి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని ఐక్యరాజ్యసమితిలో స్పష్టం చేశారు. అమెరికా నుంచి తమకు అణు ముప్పు తొలిగేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పారు.
1970 నుంచి అమెరికా కేవలం ఉత్తర కొరియాను మాత్రమే అణు దాడులకు టార్గెట్ చేసుకుందని... ఆత్మ రక్షణ కోసం అణ్వాయుధాలను కలిగి ఉండటం తమ హక్కు అని కిమ్ ఇన్ ర్యాంగ్ తెలిపారు. అణు పరీక్షలు ప్రతి ఏటా తాము నిర్వహించే మిలిటరీ డ్రిల్ లో ఒక భాగమని, అయితే తమ దేశ అగ్రనాయకత్వాన్ని అంతం చేసేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ అన్నింటికన్నా ప్రమాదకరమైందని చెప్పారు.
అమెరికా మొత్తం ఇప్పుడు తమ ఆయుధాల పరిధిలో ఉందని... ఆ దేశం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ అధినేత కిమ్ జాంగ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తర కొరియా మొత్తాన్ని నాశనం చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాతో చేతులు కలపని దేశాలను ఉత్తర కొరియా టార్గెట్ చేయబోదని తెలిపారు.
అయితే, కిమ్ వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఖండించారు. ఉత్తర కొరియాపై యుద్ధం చేసే ఆలోచన ట్రంప్ కు లేదని ఆయన స్పష్టం చేశారు.