మంత్రి కాల్వ శ్రీనివాసులు : వైఎస్సార్ పాల‌న‌లో బీసీలకు ఏం చేశారో చెప్పాలి!: జగన్ ను నిలదీసిన ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • ఎన్నిక‌ల వేళ బీసీలకు ఇచ్చిన హామీని మేము అమలు చేస్తున్నాం
  • జ‌గ‌న్‌కు నేను ఒక‌టే స‌వాల్ చేస్తున్నా
  • వైఎస్సార్ పాలనను తీసుకొస్తామని అంటున్నారు
  • బీసీల అభివృద్ధి కోసం వైఎస్సార్ హయాంలో చేసిన కృషి ఏంటో తెలపాలి

ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డానికి వ‌చ్చేనెల 2 నుంచి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీసీ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న‌ బీసీ సంఘాలతో సమావేశం కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో జ‌గ‌న్ తీరుపై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. త‌మ ప్ర‌భుత్వం బీసీల ప‌ట్ల ఎంతో బాధ్య‌త‌గా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల వేళ హామీ ఇచ్చిన‌ట్లే బీసీల‌కు ప్ర‌త్యేక ఉప ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తోందని అన్నారు.

జ‌గ‌న్‌కు తాను ఒక‌టే స‌వాల్ చేస్తున్నాని, జ‌గ‌న్‌ తండ్రి పాలించిన కాలంలో అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీసీల‌కు కేటాయిచింది ఎంతో, ఖ‌ర్చుపెట్టింది ఎంతో చెప్పాలని మంత్రి కాల్వ అన్నారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం చేసిన కృషి ఏంటో తెలపాలని నిల‌దీశారు. ఈ విష‌యాల‌పై చ‌ర్చించ‌డానికి సిద్ధ‌మా? అని అన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు చేసిన దాంట్లో వైఎస్సార్ ప్ర‌భుత్వం సగమైనా చేయలేదని అన్నారు. జ‌గ‌న్ పార్టీ నేత‌లు వైఎస్సార్ పాల‌న మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని చెప్పుకుంటున్నారని, అటువంటి పాల‌న ప్ర‌జ‌ల‌కు కావాలా? అని వ్యాఖ్యానించారు.  

వైఎస్సార్ పాల‌న గురించి ప్ర‌తి బీసీ విద్యార్థికి అర్థ‌మ‌య్యేలా చెబుతామ‌ని జగన్ అంటున్నార‌ని, మరి ‘వైఎస్సార్ పాల‌న‌లో బీసీలను రాజకీయంగా అణగదొక్కామని ప్ర‌జ‌ల‌కు చెబుతారా?  వైఎస్సార్ బీసీల వ్య‌తిరేక‌మ‌ని చెబుతారా? ఆయ‌న పాల‌న‌లో బీసీ విద్యార్థులు ర‌క్తం అమ్ముకుని ఫీజులు క‌ట్టుకున్నార‌ని చెబుతారా?’ అని కాల్వ శ్రీనివాసులు ప్ర‌శ్నించారు. 

  • Loading...

More Telugu News