గాయని చిన్మయ శ్రీపాద: లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటా!: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద
- ‘మీటూ’ హ్యాష్ ట్యాగ్ ద్వారా చిన్మయి ట్వీట్
- మహిళల వేధింపులకు సంబంధించిన ట్వీట్లు చూస్తుంటే బాధేస్తోంది
- తన స్నేహితుల్లోని కొందరు మగవారికీ వేధింపులు తప్పట్లేదన్న చిన్నయి
తనకు తెలిసి ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటానని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. హాలీవుడ్ నిర్మాత వైన్ స్టైన్ పలువురు నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు తలెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి అలిస్సా మిలానో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం ప్రారంభించింది.
వేధింపులకు గురైన మహిళలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తనకు ట్వీట్ చేయాలని కోరింది. ఈ సందర్భంగా గాయని చిన్మయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి చేసిన ట్వీట్లను చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చిన్మయి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
తన స్నేహితుల్లోని కొందరు మగవారిని వారి కన్నా వయసులో పెద్దవారైన పురుషులు లైంగిక వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చదివిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వేధింపులకు గురైన వారిలో మహిళలే కాదు, పురుషులు కూడా ఉన్నారనే విషయాన్ని చిన్మయి గుర్తుచేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు.