జగపతిబాబు: పలు సందర్భాల్లో మనకు కనబడని కులం ప్రేమ పెళ్లి దగ్గరే ఎందుకు కనబడాలి?: సినీ నటుడు జగపతిబాబు
- ఇలాంటి వన్నీ ఇగో సమస్యల వల్లే జరుగుతున్నాయి
- చాలా సందర్భాల్లో కనబడని కులం..ప్రేమపెళ్లి దగ్గరే ఎందుకు కనబడాలి?
- కులం, మతం పక్కన పెట్టండి
- ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు అభిప్రాయం
పరువు హత్యల పేరిట కన్న బిడ్డలను చంపుకోవడం మూర్ఖత్వమని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కేవలం ఇగో వల్లే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఒక కులంలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి. ఉదాహరణకు కమ్మ.. ‘మనవాళ్లురా, మనవాళ్లురా’ అంటారు, ఆ ‘మనోడు’ అనేవాడు ఒకడు పెరుగుతున్నాడనుకోండి .. కులంలోనే కుళ్లు మొదలవుతుంది. ‘వాడిని ఎట్లాగొట్లా తొక్కేయాలి’ అని చూస్తున్నారు. ఇలాంటివన్నీ ఇగో సమస్యలు. కులం, మతం పక్కన పెట్టండి. తండ్రి చచ్చిపోతే తనకు ఆస్తి వస్తుందని కోరుకునే కొడుకులు ఎంత మంది ఉన్నారు! తండ్రి చచ్చిపోయేటప్పుడు ఎవరికెన్ని ఆస్తులు రాశాడని కంగారు పడే కొడుకులు! ఈ సందర్భంలో కులమేది? డబ్బే కులమైపోయింది. పలు సందర్భాల్లో మనకు కనబడని కులం ప్రేమ పెళ్లి దగ్గరే ఎందుకు కనబడాలి?...కమ్మగా జీవితాన్ని గడపకుండా, ఈ ‘కమ్మ’,‘రెడ్డి’..కులం గోల ఏంటి!’ అని చెప్పుకొచ్చారు.