pranab mukherjee: లైవ్ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టును ఏకిపారేసిన మాజీ రాష్ట్రపతి.. వైరల్ అవుతున్న వీడియో
- రాజ్ దీప్ సర్దేశాయ్ ను హెచ్చరించిన ప్రణబ్ ముఖర్జీ
- నేను మాట్లాడుతుండగా మధ్యలో కల్పించుకోవడం ఏంటి?
- ఒక మాజీ రాష్ట్రపతితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కోపం వచ్చింది. రాష్ట్రపతి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆయన అసహనానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ప్రణబ్ దాదాను సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేశారు. లైవ్ ఇంటర్వ్యూలో ప్రణబ్ మాట్లాడుతుండగా... రాజ్ దీప్ మధ్యమధ్యలో కల్పించుకుంటూ ఏదో చెప్పబోయే ప్రయత్నం చేశారు. దీంతో ప్రణబ్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.
'ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక మాజీ రాష్ట్రపతిని' అంటూ హెచ్చరించారు. తాను మాట్లాడుతున్నప్పుడు కల్పించుకునే ప్రయత్నం చేయరాదని... ఆ మాత్రం కర్టసీ మెయింటైన్ చేయాలని అన్నారు. టీవీ స్క్రీన్ పై కనిపించాలన్న తపన తనకు లేదని... మీరు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తేనే తాను వచ్చానని చెప్పారు. దీంతో, మాజీ రాష్ట్రపతికి రాజ్ దీప్ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.