జగన్: రైతుల గురించి పట్టించుకోని జగన్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం విడ్డూరం: మంత్రి ప్రత్తిపాటి
- ఏ పథకాలు అమలవుతున్నాయో జగన్ కు తెలియదు
- సీఎంకు లేఖలు రాయడం విడ్డూరం
- రైతుల గురించే కాదు, విద్యార్థుల గురించి కూడా జగన్ లేఖ రాశారు
- మీడియాతో ప్రత్తిపాటి పుల్లారావు
రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామంలో జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ గ్రామానికి చెందిన దాత మాలెంపాటి శ్రీనివాసరావు రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ పథకాలు అమలవుతున్నాయో తెలియని జగన్ కు లేఖలు రాసే అర్హత లేదని అన్నారు. రైతుల గురించి పట్టించుకోని జగన్, వారి గురించి లేఖ రాయడం విడ్డూరమని అన్నారు. విద్యార్థుల గురించి కూడా జగన్ మరో లేఖ రాశారని, ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.