Iphone8: దొరికిన 'ఐఫోన్ 8'ను ఫోన్ చేసి మరీ యజమానికి అప్పగించిన యువకుడు!
- రూ.80 వేల విలువైన ఫోన్ దొరికినా చలించని యువకుడు
- ఫోన్ చేసి అప్పగించి నిజాయతీ చాటుకున్న వైనం
- అభినందించిన పోలీసులు
రూ. 80 వేల విలువ చేసే ఐఫోన్ 8 దొరికితే ఫోన్ చేసి మరీ యజమానికి అప్పగించాడో యువకుడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిందీ ఘటన. అంత ఖరీదైన ఫోన్ దొరికినా ఏమాత్రం చలించకుండా ఫోన్‌ను తిరిగి యజమానికి అప్పగించిన యువకుడిని అందరూ అభినందిస్తున్నారు.
బంజారాహిల్స్‌కు చెందిన కృష్ణ శనివారం జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తుండగా రోడ్డుపై ఐఫోన్ కనిపించింది. దానిని తీసుకున్న అతడు అందులోని నంబర్‌కు ఫోన్ చేసి తనకు రోడ్డుపై ఫోన్ దొరికిందని, దానిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పజెబుతానని, అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించాడు.
ఫోన్ పోయిందని కంగారు పడుతున్న బాధితుడు ఫోన్ రావడంతో సంతోషంతో పొంగిపోయాడు. వెంటనే జూబ్లీహిల్స్‌కు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో బాధితుడికి కృష్ణ ఐఫోన్‌ను అందించాడు. పోలీసులు సహా యజమాని కృష్ణ నిజాయతీకి మెచ్చుకుని అభినందించారు.