trump: పాకిస్థాన్ కు మళ్లీ దగ్గరవుతున్న అమెరికా!
- అమెరికన్ జంట విడుదలతో మారిన పరిస్థితి
- కొత్త సంబంధం మొదలైందన్న ట్రంప్
- గతంలో విమర్శించి, ఇప్పుడు మనసు మార్చుకున్న యూఎస్ అధ్యక్షుడు
సుదీర్ఘకాలం పాటు పాకిస్థాన్ తో అంటకాగుతూ తిరిగి, ఆపై ఉగ్రవాదులకు పాక్ చేస్తున్న సాయంతో విరక్తి చెంది దూరమైనట్టు కనిపించిన అమెరికా, తిరిగి ఆ దేశానికి దగ్గరవుతోంది. రెండు దేశాలూ సరికొత్త సత్సంబంధాలను ప్రారంభిస్తున్నాయని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వ్యాఖ్యానించారు. పాక్ కేంద్రంగా నడుస్తున్న హక్కానీ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న అమెరికన్ - కెనడియన్ కుటుంబాన్ని పాక్ ప్రభుత్వం విడిపించిన నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో పాక్ సైన్యం హక్కానీ ఉగ్రవాదుల బారి నుంచి తమ దేశ పౌరురాలు కోలేమాన్, ఆమె భర్త బోయ్ లేలను రక్షించాయని అన్నారు. ఈ ఘటనతో పాకిస్థాన్ అమెరికాతో మరింత స్నేహాన్ని కోరుతుందన్న సంకేతాలు వెలువడ్డాయని, తాము కూడా అదే విధమైన అభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పాకిస్థాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఉండటాన్ని గతంలో తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్, ఇప్పుడు ఒక్క ఘటనతో మారిపోడవం గమనార్హం. కాగా, 2012లో బోయ్ లే, కోలేమాన్ లను హక్కనీ సంస్థ కిడ్నాప్ చేయగా, కిడ్నాపర్ల వద్ద బందీలుగా ఉన్న సమయంలోనే వీరికి ముగ్గురు పిల్లలు జన్మించడం విశేషం.